‘నీచ రాజకీయాలు మానుకోకుంటే ప్రజలే బుద్ధి చెబుతారు’

విజయవాడ : ప్రజలకు కష్టాల్లో అండగా నిలవాల్సిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హైదరాబాద్‌లో సినిమా షూటింగ్‌లు చేసుకుంటున్నాడని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ విమర్శించారు. ప్రజలు రేషన్‌ షాప్‌ వద్ద సరుకులు తీసుకున్నప్పుడు కామెంట్‌ చేసిన పవన్‌కు.. బ్యాంకుల వద్ద జనం క్యూలో నిల్చున్నవి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. విజయవాడ భవానీపురం 40వ డివిజన్‌లో యరడ్ల ఆంజనేయ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం 5వేల కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ పాల్గొని పేదలకు సరుకులు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కరోనా నియంత్రణకు కృషి చేస్తున్నారని తెలిపారు. (కరోనాపై గెలిచిన బాలీవుడ్ గాయ‌ని)



ప్రజలకు ఆరోగ్యం, శానిటేషన్‌, తాగునీటి సమస్యలు లేకుండా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. నేరుగా ప్రజలకు వెయ్యి రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామని తెలిపారు. కన్నా లక్ష్మీనారాయణ మా డబ్బు.. మా డబ్బు అంటున్నారని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 1300 కోట్లు జీవో విడుదల చేశారని ఆయన గమనించాలని సూచించారు. కేంద్రంలో బీజేపీ ఇచ్చేవి జన్‌ధన్‌ పథకంలో వేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో కరోనా కట్టడికి పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టామని తెలిపారు. సంక్షేమ పథకాలు నేరుగా ఇంటి వద్దకే చేరవేస్తున్న ఏకైక సీఎం వైఎస్‌ జగన్‌ అని ప్రశంసించారు. ప్రతిపక్షాలు పనికిమాలిన విమర్శలు మానుకొని.. ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు రావాలని మంత్రి హితవు పలికారు. (భయపడితేనే ప్రాణాలు కాపాడుకోగలం: సల్మాన్‌ )