ఢిల్లీ : కరోనా కట్టడికి మీ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించండి అని బీజేపీ 40వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో భాగంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కోరానాపై మన పోరాటాన్ని ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రశంసించిందని తెలిపారు. యావత్ ప్రపంచం మన సంకల్పాన్ని మెచ్చుకుందన్నారు. కరోనాపై పోరాటానికి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. అన్ని రాష్ట్రాల సహకారంతో కోరానాపై పోరాటం చేస్తున్నామని పేర్కొన్నారు. దీపయజ్ఞంతో 130 కోట్ల మంది భారతీయులు ఐకమత్యంతో మన సంకల్పాన్ని చాటిచెప్పారన్నారు.
క్లిష్టసమయాల్లో ఎలా ఉండాలో భారత్ ప్రపంచ దేశాలను దిశా నిర్ధేశం చేసిందని మోదీ అన్నారు. కరోనాపై వేగంగా స్పందించిన దేశాల్లో భారత్ ఒకటి, ఈ సమయం దేశానికి ఒక ఛాలెంజ్ లాంటిదన్నారు. వేగమైన, కఠినమైన నిర్ణయాలే కరోనాను అడ్డుకోగలవని స్పష్టం చేశారు. కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందన్నారు. కరోనాను తరిమి కొట్టడానికి అందరం ఒక్కటవుదామన్నారు. లాక్‌డౌన సమయంలో ప్రజలంతా సహకరించాలని, బయటకు ఎప్పుడు వెళ్లినా మాస్కులు ధరించాలని సూచించారు. పీఎం కేర్‌కు ఉదారంగా విరాళాలివ్వాలని కోరారు. ఆరోగ్య సేతు యాప్‌ను అందరూ ఇన్‌స్టాల్ చేసుకోవాని విజ్ఞప్తి చేశారు.